Bandi Sanjay Responded to KTR Legal Notice: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ.. రెేవంత్రెడ్డి, బండి సంజయ్‌లకు.. మంత్రి కేటీఆర్ మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు. ఆరోపణలపై వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు.
మంత్రి కేటీఆర్ ఉడుత బెదిరింపులకు భయపడేది లేదని.. లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడుతానని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. మంత్రి పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తారని.. తనకు లీగల్ నోటీసు జారీ చేసినట్లు వచ్చిన వార్తను పత్రికల్లో చూసినట్లు చెప్పారు. ఆయన పరువు ఖరీదు రూ.100కోట్లా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
యువత భవిష్యత్తు మూల్యమెంతో కేటీఆర్ చెప్పాలి?:ఈ క్రమంలోనే యువత భవిష్యత్ మూల్యమెంతో కేటీఆర్ చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించాకు. లీకేజీలో తన కుట్ర ఉందని కేటీఆర్ ఆరోపించారని.. వాటిపై తాను ఎన్నికోట్లకు దావా వేయాలని పేర్కొన్నారు. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రధానమంత్రి స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేటీఆర్ కుసంస్కారానికి నిదర్శనమని ఆరోపించారు.
సాధారణ అంశంగా మలిచేందుకు.. మంత్రుల ప్రయత్నం: ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు.. మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్‌కి ఎలా లీక్ అవుతున్నాయని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాలు పత్రాల లీకేజీ విచారణను ప్రభావితం చేసే విధంగా మంత్రి మాట్లాడుతున్నందుకు.. సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. తప్పిదాలను ప్రశ్నిస్తున్న తమపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తారా అని పేర్కొన్నారు.