Bandi Sanjay Reaction On Brs: తెలంగాణ ప్రజలు తెరాసకు ఓటు వేస్తే దానిని బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్కు.. ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓట్లేసిన ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పేరు మార్చినట్లుగానే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. తెరాసను దివాళా తీసిన కంపెనీగా బండి సంజయ్ అభివర్ణించారు.
ఇప్పటి వరకు రాష్ట్రాన్ని దోచుకుని.. బీఆర్ఎస్ పేరుతో ఇక దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కుట్రపూరితంగానే జాతీయ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. మునుగోడులో ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణకు ఎందరో టూరిస్టులుగా వస్తారని చెప్పి.. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ టూరిస్టుగా మారారని ఎద్దేవా చేశారు.
మహిళా వివక్ష గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరం:జాతీయ పార్టీలు ఏం చేస్తాయన్న వ్యక్తి ఇప్పడు జాతీయ పార్టీ ఎందుకు పెట్టారని బండి సంజయ్ నిలదీశారు. అవకాశవాదులు, రాజకీయ నిరుద్యోగులే కేసీఆర్‌తో ఉన్నారని ఆక్షేపించారు. ఐదేళ్లపాటు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ లేరని విమర్శించారు. సంవత్సరాల పాటు మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. మహిళా వివక్ష గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరమని అన్నారు.
దళితబంధు ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి: రాష్ట్రపతిగా ఎస్టీ మహిళ పోటీ చేస్తుంటే ఓటమికి యత్నించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 17.50 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం దళిత బంధు 8.4 లక్షల కుటుంబాలకు ఇచ్చిన్నట్లు గొప్పలు చెప్పారని ఆరోపించారు. దళితబంధు ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రకటించిన పార్టీకి జెండా లేదని బండి సంజయ్ విమర్శించారు.