Bandi Sanjay Reacted To BJP Alliance With TDP : తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుబండి సంజయ్ కొట్టిపారేశారు. అలాంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆదివారం వివిధ జిల్లాల నేతలతో బండి సంజయ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
BJP Alliance With TDP : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేముందని బండి సంజయ్ ప్రశ్నించారు. గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులు, కార్యకర్తలకు సూచించారు. అందుకోసం ఇక నుంచి చేపట్టబోయే కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేయాలని కోరారు. కేసీఆర్ మాదిరిగా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను కలవకుండా ప్రగతి భవన్‌కే పరిమితమై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజం బీజేపీది కాదని తెలిపారు. చంద్రబాబుతో పొత్తు గురించి చర్చించారనడం ఊహాజనితమేనని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని అన్నారు.