BJP Raithu Deeksha: సీఎం కేసీఆర్‌కు చేతనైతే వడ్లు కొనాలని లేదంటే... గద్దె దిగాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం చేయలేకే... దిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద భాజపా చేపట్టిన రైతుదీక్షలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం సంక్షోభంలో ఉందని అందుకే దృష్టి మరల్చేందుకే వరి పేరుతో దిల్లీలో ధర్నా చేపట్టారని ఆరోపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఉన్నప్పుడు ధాన్యం కొనడానికి మాత్రం ఎందుకు ఉండవని ప్రశ్నించారు.
ఏడేళ్ల నుంచి కేంద్రమే ధాన్యం కొంటోందని తెలిపిన బండి... తెరాస రైతులను అరిగోస పెడుతోందన్నారు. ఇప్పటికీ కేంద్రం కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈసారి ఎంత ధాన్యం ఇస్తారో చెప్పాలని కేంద్రం కోరుతోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు నివేదిక ఇస్తే... తెలంగాణ మాత్రం ధాన్యం ఇవ్వమని అని స్పష్టం చేసిందని వివరించారు. రాష్ట్రంలో ఉరి వద్దు.. వరి కావాలి అని హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించారని బండి సంజయ్ గుర్తుచేశారు.
కళ్లు మూసి తెరిచేలోగా దిల్లీలో కేసీఆర్ దీక్ష ముగిసింది. ఆయనకు వయసు మీద పడింది. సోయి తప్పి మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలిసి కేసీఆర్ కొడుకు కేటీఆర్... నన్ను సీఎం చేయండి డాడీ.. డాడీ.. అంటుంటే భయమేసిన కేసీఆర్ ప్యాడి.. ప్యాడి అంటున్నాడు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు, కరెంట్ బిల్లులు పెంచారు. వీటి నుంచి దృష్టి మళ్లించేందుకు దిల్లీకి వెళ్లారు. కేసీఆర్ రైతులను ఎందుకు మభ్యపెడుతున్నారు. మేమే ధాన్యం కొనేది.. కేంద్రం పెత్తనమేంది అని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు ఎందుకు కొంటలేడు. రాష్ట్రం బ్రోకరైజ్ చేసి కేంద్రానికి ధాన్యం ఇవ్వాలి.. కానీ ఎందుకు చేస్తలేడు? ఫిబ్రవరిలో కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఈసారి తెలంగాణ నుంచి ధాన్యం ఇవ్వడం లేదు అని చెప్పి రైతుల బతుకులు ఆగం చేసింది నిజం కాదా? ఫ్రీ యూరియా ఇస్తామని హామీలిచ్చి మోసం చేశారు.
-- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు