Bandi Sanjay on Ration Dealers Strike in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న రేషన్ డీలర్ల ప్రతినిధులతో... పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమావేశమయ్యారు. అపరిష్కృతంగా ఉన్న డీలర్ల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్ల సమ్మెకు.. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ జనసమితి సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రేషన్ డీలర్లను పిలిచి మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమన్నారు.
పేదల నోటికాడ ముద్దను లాక్కోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోనందునే డీలర్లు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సంజయ్ పేర్కొన్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోందని.. ఆ సొమ్మును డీలర్లకు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకుంటూ డీలర్లకు సకాలంలో చెల్లించకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని... పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందని బండి సంజయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైనా రేషన్ డీలర్లతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంతాలు పట్టింపులకు పోయి సమ్మెను పరిష్కరించకుండా పేదల నోటికాడ ముద్దను లాక్కోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు.