Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలప్పుడు యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్’ నిర్వహించాలని బండి సంజయ్ పార్టీ నేతలకు సూచించారు. కేసీఆర్ పాలన పట్ల జనం విసిగిపోయారని. తెరాసను ధీటుగా ఎదిరించే పార్టీ భాజపా మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ, కిసాన్, మహిళా, మైనారిటీ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఆయా మోర్చాల జిల్లా, మండల కమిటీల ఏర్పాటు, జిల్లా, కార్యవర్గ సమావేశాల తీరుతెన్నులు, కేంద్ర పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడానికి మోర్చాలు చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపడుతున్న కార్యక్రమాలు, ఆయా మోర్చాలు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై దాదాపు రెండున్నర గంటలపాటు సుధీర్ఘంగా సమీక్షించారు.
ఈసారి భాజపాకు ఒక్క ఛాన్స్ ఇద్దామని జనం ఆలోచిస్తున్నారని... ఇటీవల వెల్లడైన ఓ సర్వే సంస్థ ఫలితాలే నిదర్శనమన్నారు. పార్టీ నేతలపై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నందున... అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నందున మోర్చాల నాయకులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తూ కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ విషయంలో మోర్చాల పనితీరును మరింతగా మెరుగుపరచుకోవాలని కోరారు. రాష్ట్రంలో భాజపా నేతలకు ఏ కష్టమొచ్చినా, ఆపదొచ్చినా ఆదుకునేందుకు జాతీయ నాయకత్వం సిద్దంగా ఉందని.. కరీంనగర్లో తనపై, నిజామాబాద్‌లో అర్వింద్‌పై దాడి జరిగిన వెంటనే జాతీయ నాయకత్వం స్పందించిన తీరే ఇందుకు నిదర్శనమని భాజపా నేతలకు తెలిపారు.