Bandi Sanjay on Double Bedroom Houses : రాష్ట్రంలో లక్షకు పైగా ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన డబ్బులు వాడుకొని.. డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మించకుండా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్ల పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు నిరసనగా కూకట్‌పల్లి జోనల్ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల ఆత్మ గౌరవ దీక్షకు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యాలను, మోసాలను లేవనెత్తుతున్నారనే భయంతో బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. తమ పార్టీ నాయకులను అడ్డుకోలేరని.. భయపెట్టలేరని తేల్చి చెప్పారు. ధర్మం కోసం బీజేపీ నాయకులు నిరంతరం ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉంటారని ఆయన గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్‌ల విషయమై జాబితా ఇవ్వాలని కేంద్రం ఎన్నిసార్లు కోరినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ.. నిరుపేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
జాబితాను కేంద్రానికి ఇవ్వండి..: కేంద్రం నిధులతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఉంటే.. ధైర్యంగా జాబితాను కేంద్రానికి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజలు ఓటు బ్యాంకుతో కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.