Bandi Sanjay Letter to SIT: రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్ నుంచి తనకు ఎలాంటి నోటీసు అందలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సిట్‌కు ఆయన లేఖ రాశారు. సిట్ కార్యాలయం నుంచి ఎలాంటి నోటీసు రాలేదని.. అందులోని విషయాలు తాను చూడలేదనే అంశాన్ని నిస్సందేహంగా తెలియజేస్తున్నాని చెప్పారు.
వార్తా కథనాల ద్వారా తెలిసింది:ఈ రోజు సిట్ ఎదుట తాను హాజరు కావాల్సింది ఉందని వార్తా కథనాల ద్వారా తెలిసిందని బండి సంజయ్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎంపీగా పార్లమెంట్‌కు హాజరు కావాల్సిన బాధ్యత తనకుందని చెప్పారు. సమావేశాల దృష్ట్యా ఇవాళ సిట్ విచారణకు తాను రాలేనని స్పష్టం చేశారు. దీనిపై హాజరుకు మరో తేదీ ఇవ్వాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు నిన్ననే బీజేపీ వర్గాలు బండి సంజయ్ సిట్ విచారణకు హాజరుకావడం లేదని తెలిపాయి. పార్లమెంట్ సమావేశాల వల్ల ఆయన దిల్లీలోనే ఉన్నారని పేర్కొన్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సభ్యులంతా సభకు హాజరుకావాలని అధిష్ఠానం విప్ జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
ఇదిలా ఉండగా.. సిట్ అధికారుల విచారణకు రేవంత్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో భాగంగా గ్రూప్-1 పేపర్ అంశంపై ఆయన పలు ఆరోపణలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిట్ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డి విచారణకు హాజరై వాటిపై వివరణ ఇచ్చారు.