Bandi Sanjay Letter To Sarpanches: గ్రామాలు స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. 73, 74 రాజ్యాంగ అధికరణలకు తెరాస ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే ఆందోళనలకు భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ మేరకు బండి సంజయ్ గ్రామ సర్పంచ్‌లకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు.
గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి సర్పంచ్‌ల పట్ల జిల్లా అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు గ్రామ సర్పంచ్‌ల హక్కులు పరిరక్షణ కోసం త్వరలోనే భాజపా మౌన దీక్ష చేపడుతుందని సంజయ్ పేర్కొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. గ్రామ స్వరాజ్యం సాధించి... రామరాజ్యాన్ని నిర్మించుకుందామని సూచించారు.
గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. సర్పంచ్‌ల పట్ల జిల్లా అధికారులు వేధింపులు ఆపాలి. న్యాయమైన డిమాండ్ల కోసం చేసే ఆందోళనలకు మా మద్దతు ఉంటుంది. సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడవద్దు, అధైర్యపడవద్దు. సర్పంచ్‌లకు అండగా భాజపా ఉంటుంది. సర్పంచ్‌లు సగర్వంగా తలెత్తుకునేలా చేసే బాధ్యత భాజపాది. సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ కోసం త్వరలో మౌనదీక్ష చేపడతా. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. -- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు