Bandi Sanjay letter's to KCR about electricity employees: విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగులకు జీపీఎఫ్, పీఆర్‌సీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారని, దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గర్హనీయమన్నారు.
ఆర్టిజన్లు, ఉద్యోగుల పట్ల విద్యుత్ శాఖ యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ కనీసం శ్రద్ధ చూపకపోవడం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని కనబరుస్తోందని తెలిపారు. జీపీఎఫ్, పీఆర్సీ వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 1999 నుండి 2004 మధ్య కాలంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొన్నారు.
Bandi Sanjay fires on cm KCR స్వరాష్ట్రం సాధించడానికి తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వ పాలనలో విద్యుత్ శాఖ అత్యంత కీలకమైందని.. ఆర్టిజన్లు, విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి దిగితే మొత్తం రాష్ట్ర పాలనా యంత్రాంగమే కుప్పకూలుతుందని హెచ్చరించారు.