Bandi Sanjay Letter to CM KCR : రాష్ట్రంలోని పోలీసు నియామకాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. వెంటనే దేహదారుఢ్య పరీక్షల్లోని లోపాలను, అవకతవకలను సవరించి.. వారికి న్యాయం చేయాలని లేఖలో కోరారు. దేహదారుఢ్య పరీక్షలను నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించినట్లు అభ్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయని బండి లేఖలో పేర్కొన్నారు. లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్లో చెప్పిన దానికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దాదాపు రెండు లక్షల మంది పురుష, మహిళ అభ్యర్థులు అర్హత సాధించలేకపోయినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని బండి సంజయ్ లేఖలో ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన పోలీసు నియామకాల ప్రక్రియ ప్రారంభం నుంచి వివాదాలకు ఆడ్రస్‌గా మారడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం అని వాపోయారు. తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ నోటిఫికేషన్‌కు భిన్నంగా కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడం అన్యాయమని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.