BANDI SANJAY LETTER TO CM KCR: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రూ.6 వేల కోట్ల భారం మోపుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వం రెఫరండంకు సిద్ధం కావాలని లేఖలో బండి సంజయ్ హెచ్చరించారు.
విద్యుత్ ఛార్జీల తగ్గింపు విషయంలో ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తే.. ప్రజలే తెరాసకు 'కరెంట్ షాక్' ఇస్తారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.48 వేల కోట్లు చెల్లించకపోవడంతోనే అవి దివాళా తీసి.. అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా పాతబస్తీలో ఎంఐఎం నేతలకు భయపడి.. కరెంట్ బిల్లులు వసూలు చేయడంలో తెరాస ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.
దాడులు చేస్తున్నా.. చర్యలు సున్నా..: బిల్లుల కోసం వెళ్లిన విద్యుత్ శాఖ ఉద్యోగులపై పాతబస్తీలో ఎంఐఎం నాయకులు దాడులు చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని.. లేనిపక్షంలో తగ్గించే వరకు ప్రజల పక్షాన నిలబడి భాజపా పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.