Bandi Sanjay Questions CM KCR on Telangana Development :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వడ్ల కుప్పలపై రైతు చనిపోమే దుస్థితికి కారణమెవరని ప్రశ్నించారు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని, ఫ్రీ యూరియా, విత్తనాలు ఇస్తానని హామీలిచ్చి మాట తప్పింది నిజం కాదా అని నిలదీశారు. రైతుబంధు ఇచ్చి.. మిగతా పథకాలన్నీ ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. లాకప్ డెత్‌లు చేయడం, ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, జైళ్లకు పంపడమేనా అని సూటిగా ప్రశ్నించారు.
bandi sanjay Letter to CM KCR on decade celebrations :గత పాలనతో పోలిస్తే మూడింతల కరెంట్ ఛార్జీలను పెంచడమే కాక.. ఏసీడీ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరిట జనంపై భారం మోపడమే విద్యుత్ రంగంలో బీఆర్‌ఎస్ సర్కారు సాధించిన విజయమా అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రగతి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఎందుకు విఫలవుతోందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మీ 9 ఏళ్ల పాలనలో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి? ఎంత మంది ఉపాధి కోల్పోయారు? ఎన్ని పరిశ్రమలొచ్చాయి? కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని బండి సవాల్ విసిరారు.
కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ సంధించిన మరికొన్ని ప్రశ్నలు ఇవే..
- సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప మీరు సాధించిన ప్రగతి ఏముంది?
- మిషన్ కాకతీయ పథకాన్ని కమీషన్ల కాకతీయగా మార్చి దండుకోవడం నిజం కాదా?
- మిషన్ కాకతీయ ద్వారా అదనంగా ఎంత ఆయకట్టుకు నీరందించారో చెప్పే దమ్ముందా?
- 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఓట్లు దండుకుని మోసం చేసింది మీరు కాదా?
- 3.5 లక్షల పాత పెన్షన్లను తీసేయడమే కాకుండా కొత్త పెన్షన్ల కోసం 14 లక్షల మంది ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా.. కనికరం చూపని మాట వాస్తవం కాదా?
- సారు...కారు...60 పర్సంట్ సర్కార్ ఎవరిది?
- దళితబంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకున్న అవినీతి ప్రభుత్వం మీది కాదా?
- ప్రశ్నించే గొంతులను పోలీసుల ద్వారా అణచి వేయిస్తూ.. విజయవంతంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నందుకు 'సురక్షా దినోత్సవం' జరుపుకోవాలనుకుంటున్నారా?
- మహిళలపై అఘాయిత్యాల్లో దక్షిణాదిలోనే తెలంగాణే టాప్‌లో ఉన్నందుకు.. మహిళలపై సొంత పార్టీ నేతలే అఘాయిత్యాలు చేస్తున్నందుకు 'మహిళా దినోత్సవం' జరుపుకోవాలనుకుంటున్నారా?
- సర్కారు దవాఖానాల్లో వసతుల్లేక బాలింతలు చనిపోతున్నందుకు, రోగమొస్తే ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఆస్తులమ్మి చికిత్స చేయించుకునే దుస్థితి వచ్చినందుకు 'వైద్యారోగ్య దినోత్సవం' జరుపుకుంటున్నారా?
- పల్లెలు, పట్టణాల ప్రగతిని గాలి కొదిలేసినందుకు పల్లె, పట్టణ ప్రగతి ఉత్సవాలు జరుపుకుంటున్నారా?
- ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10 లక్షలిస్తామని చెప్పి మోసం చేసినందుకు.. సర్పంచుల డిజిటల్ కీని దొంగిలించి డబ్బులు కాజేసినందుకు, బిల్లులు రాక సర్పంచులు ప్రాణాలు తీసుకుంటున్నందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నారా?
- రాష్ట్రంలో 29 వేల బడుల పరిస్థితి అధ్వాన్నంగా మారినందుకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పురుగుల అన్నమే దిక్కని చాటి చెప్పేందుకే 'విద్యా దినోత్సవం' జరుపుకోవాలా?
- అమరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో వారి కుటుంబాలను గాలికొదిలేసి.. ఉద్యమ ద్రోహులు రాష్ట్రాన్ని పాలిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నందుకు 'అమరుల సంస్మరణ దినం' జరుపుకోవాలా?
- మీ కుటుంబ పాలనలో బాగుపడ్డదెవరు? దగాపడ్డదెవరు? 9 ఏళ్ల పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి, వివిధ రూపాల్లో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?