Bandi Sanjay Letter to CM KCR About Retired Employees Pension : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ విడుదల చేసి... పీఆర్సీని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నెలాఖరుతో పీఆర్సీ గడువు ముగియనున్నప్పటికీ ఇంతవరకు కొత్త పీఆర్సీని వేయకపోవడం అన్యాయమన్నారు. విశ్రాంత ఉద్యోగులకు గత రెండు నెలలుగా పింఛన్‌ను విడుదల చేయకపోవడంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు రిటైర్డ్ అయిన తొలి రోజునే.. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్న హామీ ఏమైందని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ ప్రశ్నించారు.
Bandi Sanjay Latest Comments : నెలల తరబడి విశ్రాంత ఉద్యోగలు కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా కనికరం లేదా అని సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాలోనే 460 మంది ఉద్యోగుల పింఛన్ దస్త్రాలు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. ఉద్యోగులు పింఛనర్ల కుటుంబాలు రాబోయే ఎన్నికల్లో మీకు బుద్ది చెప్పడం ఖాయమని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి లేఖలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ డీలా పడింది. ఊపు మీద ఉన్న కాషాయదళం ఒక్కసారిగా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. నేతల మధ్య విభేదాలు, బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముంగిట కార్యక్రమాల నిర్వహణ లేక పార్టీలో నెలకొన్న స్తబ్ధత తీవ్ర నష్టం చేస్తోందని గ్రహించిన జాతీయ నాయకత్వం అప్రమత్తమైంది. శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు'మహా జన్ సంపర్క్ అభియాన్'పేరుతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. రోజుకో కార్యక్రమం చేపడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతొంది.
ఈనెల 22న 'ఇంటింటికీ బీజేపీ': అలాగే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన... పూర్తి చేసుకోనున్న వేళ భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్దం చేసింది.ఈనెల 22న ఇంటింటికీ బీజేపీపేరుతో.... ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. తెలంగాణలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రం పరిధి అధ్యక్షుడి మొదలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వరకు ప్రతి ఒక్కరు... ఆ రోజున తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలవనున్నారు. ఈనెల 22న ఉదయం ఏడింటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 'ఇంటింటికీ బీజేపీ' పేరుతో ప్రజలతో మమేకం కానున్నారు. తెలంగాణలో... బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలు ఉండగా.... ప్రతి పోలింగ్ కమిటీ అధ్యక్షుడు తమ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో కనీసం వంద కుటుంబాలను కలిసి మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారని.... ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం 22 నుంచి 30 వరకు సాగుతుందని వెల్లడించారు.
ఇవీ చదవండి :