Bandi Sanjay comments on TSPSC Paper leakage : టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న తమ కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదని స్పష్టం చేశారు.
BJP reaction on TSPSC Paper leakage : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం నిరుద్యోగులకు నష్టం కలిగిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. నేరగాళ్లయిన హ్యాకర్లను ఒప్పంద పద్ధతుల్లో నియమించడం ద్వారా ఈ తరహా లీకేజీలు జరుగుతున్నాయని అన్నారు. అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తలందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని గుర్తు చేశారు. గతానుభవాలను చూస్తే ఈ కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందా అని ఆయన ప్రశ్నించారు. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ సహా సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసునూ రాష్ర ప్రభుత్వం నీరుగార్చేందుకు యత్నిస్తోందని ఆయన విమర్శించారు. దీనిలో భాగంగానే సిట్‌కు అప్పగించారని ధ్వజమెత్తారు.