Bandi Sanjay latest comments on KTR : మరికొన్ని నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా అసెంబ్లీ సమరభేరీలో కాషాయజెండా ఎగురవేయటమే లక్ష్యంగా కమలదళం విస్తృత కార్యక్రమాలు చేపడుతోంది. వీధి సభలు, స్వశక్తికరణ్‌లాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల నిర్వహించిన వీధి సభల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. హన్మకొండలోని కేయూ క్రాస్ రోడ్డుతో పాటు వర్ధన్నపేటలో జరిగిన వీధిసభలో ప్రసంగించిన బండి సంజయ్ అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమం: భూపాలపల్లి జిల్లా కాటారంలో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో పార్టీ నేత వివేక్‌తో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. చంద్రుపట్ల సునీల్‌రెడ్డి 20 రోజులుగా చేస్తున్న ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. సింగరేణి నిధులు ఏటీఎంగా వాడుకున్నారని కాళేశ్వరంలో వేల కోట్ల దోపిడీ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పోరాటంతోనే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవొచ్చిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి భగ్గుమన్నారు.
ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమం: మద్యం దందాలో మాత్రమే తెలంగాణను కేసీఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో "ప్రజా గోస - బీజేపీ భరోసా" కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం సాధ్యపడదని ఆనాడే తాను కేసీఆర్‌కు చెప్పానని ఈటల అన్నారు. ఆయన గొప్పలకు పోయినందునే నేడు పేదల కల నెరవేరని పరిస్థితి నెలకొందన్నారు. అబ్కారీ శాఖను మద్యం తాగించే శాఖగా మార్చారని ఈటల ఆరోపించారు. ఆ ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు.