Bandi Sanjay Tweet Today : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రేపు ముగ్గురు ముఖ్యమంత్రుల పర్యటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సమావేశానికి ముందు హిందూ దేవాలయాన్ని పెట్టుబడి అవకాశంగా చూపించేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలను కేసీఆర్ ఆహ్వానిస్తున్నారా అని ప్రశ్నించారు. యాదాద్రిని పెట్టుబడి అవకాశంగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే యాదాద్రి అభివృద్ధి అనేది పెట్టుబడిగా, పవిత్ర హుండీకి ప్రజల విరాళాలు రాబడి అని ట్విట్టర్ టిల్లు చెప్పారంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
"కల్వకుంట్ల కుటుంబానికి ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఇతర రాష్ట్రాల సీఎంలను యాదాద్రికి ఎందుకు తీసుకెళ్తున్నారు. యాదాద్రిని పెట్టుబడి అవకాశంగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు." - ట్విటర్లో బండి సంజయ్
అసలు విషయం ఏంటంటే..:ఖమ్మంలో రేపు నిర్వహించే బీఆర్ఎస్ సభకుముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్, పినరయి విజయన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, పలువురు జాతీయ నాయకులు హాజరుకానున్నారు. ఇందుకోసం జాతీయ నేతలంతా నేడు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. బుధవారం ఉదయం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అల్పాహారం చేశాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఖమ్మం బయలుదేరుతారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ తాజాగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.