Bandi sanjay fires on KCR మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్‌కు ఓడిపోతానని తెలిసిపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా... రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేటలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న బండి సంజయ్ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ నూతన సచివాలయానికి బీఆర్ అంబేడ్కర్‌కు పేరు పెట్టడంపై బండి విరుచుకుపడ్డారు. బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవం ఇచ్చిన పార్టీ దళితుల్ని ఎలా మోసం చేసిందని ప్రశ్నించారు. పోడు భూముల పేరుతో గర్భిణీలపై లాఠీఛార్జ్ చేయించిన పార్టీ తెరాస అని గుర్తు చేశారు.
దళితుడిని సీఎం చేయాలి: ప్రజా సంగ్రామ యాత్రలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు వచ్చారని వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా భాజపానే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ తెలుసుకోవాలని ఈ సభ ముఖంగా తెలిపారు. కొత్త సచివాలయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసి కుర్చీలో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే దళిత సమాజం విశ్వసిస్తోంది కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
''దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పార్లమెంట్‌లో పెట్టింది భాజపా. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చింది భాజపా. అంబేడ్కర్ చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేలా పంచ తీర్ధాలను ఏర్పాటు చేసింది భాజపా. ఒవైసీకి ఎప్పుడు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, తెరాస కార్యకర్తలే కనబడుతున్నారు. మజ్లిస్‌ను కలుపుకొని రా కేసీఆర్... బల ప్రదర్శనకు భాజపా సిద్ధం.'' - బండి సంజయ్
ఏ పథకాలు రద్దు చేయం: తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని బండి సంజయ్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాలను రద్దు చేయమని వెల్లడించారు. భాజపా అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. మునుగోడులో భాజపా గెలవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది అని వ్యాఖ్యానించారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15నుంచి ప్రారంభిస్తానని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే... ఇబ్రహీంపట్నం పేరును వీర పట్నంగా మారుస్తామని వివరించారు.