Bandi Sanjay Fires on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటన నేపథ్యంలో భాజపా నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భంధం చేయడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా? అని ప్రశ్నించారు. జనగామ జిల్లాకు చెందిన భాజపా నాయకులు, కార్యకర్తలను గత రెండు రోజులుగా అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్లో నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వాళ్లేమైనా ఉగ్రవాదులా? నిషేధిత సంస్థ సభ్యులా అని ప్రశ్నించారు.
'భయపడే ప్రసక్తే లేదు'
గతంలో ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తున్నారంటే... జనం సంతోషంగా ఉండేవాళ్లని తెలిపారు. ప్రజలు వినతి పత్రాలతో సీఎంను కలిసేందుకు సిద్ధంగా ఉండేవాళ్లన్నారు. కానీ సీఎం కేసీఆర్ వస్తుంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొందని బండి ఆరోపించారు. ఎంతమందిని అరెస్టు చేసినా... మరెన్ని దాడులు చేసినా భాజపా కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు.