Bandi Sanjay Comments on KCR: సమానత్వం గురించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్.. ఏడేళ్లుగా ప్రధాని మోదీని ఎందుకు అడగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలకాల్సిన కనీస బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం పనుల పురోగతిని బండి సంజయ్ పరిశీలించారు. శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ కలసి సమానత్వం గురించి మాట్లాడాల్సిందని హితవు పలికారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు.
అది కనీస బాధ్యత
"ప్రైవేటు కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రధానికి స్వాగతం పలకాల్సిన కనీస బాధ్యత సీఎం కేసీఆర్‌కు లేదా.?. దళితుడిని సీఎం చేస్తా అని కేసీఆర్ మోసం చేశారు. సమానత్వం గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. ఇన్ని రోజులు ప్రధానిని ఎందుకు అడగలేదు.? కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి. కానీ దళితులకు ఏం ఇచ్చారు.?" -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు