Bandi sanjay: సికింద్రాబాద్ అల్లర్లలో రాష్ట్ర ప్రభుత్వ హస్తముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పథకం ప్రకారమే తెరాస కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్నారు. అల్లర్లు జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం అలసత్వం వహించారని విమర్శించారు. రైల్వేస్టేషన్‌లోకి పెట్రోల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రంపై బురద జల్లేందుకే తెరాస గుండాలు దాడి చేశారని వెల్లడించారు. సికింద్రాబాద్‌లో జరిగిన నష్టానికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన శక్తి కేంద్ర ఇంఛార్జ్‌ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచే విధ్వంసానికి కుట్ర జరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని.. అయినా కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో ఈరోజు వరంగల్ జిల్లాలో తెరాస నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. ఆర్మీ అభ్యర్థులతోపాటు ప్రజలంతా వాస్తవాలు గమనించాలని ఆయన కోరారు.
భాజపా నాయకులు చిన్న మీటింగులు పెట్టినా, ధర్నాలు చేసినా ఇంటెలిజెన్సుకు తెలుస్తుంది.. కానీ వందల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుమిగూడి విధ్వంసం సృష్టిస్తే ఆ సమాచారం ఇంటెలిజెన్స్ వాళ్లకు ఎందుకు తెలియదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహం, సహకారంతోనే ఈ విధ్వంసానికి కుట్ర జరిగిందని తెలిపారు. విధ్వంసం చేసినోళ్లు పారిపోయేలా చేశారన్నారు. కానీ అమాయకులైన ఆర్మీ అభ్యర్థులను మాత్రం సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ట్విటర్ మంత్రి లేదా మరోకరో ఆదేశించే వరకు వారిని ఖాళీ చేయించలేదు. అంతా అయిపోయాక రాత్రి సీఎం స్పందించడం విడ్డూరమని పేర్కొన్నారు.