Bandi Sanjay districts tour : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కమలం పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ తామేనని అనేక సందర్భాల్లో వెల్లడించిన కాషాయ దళం.. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణలో విస్తరించిన రైల్వేలు, రోడ్లు, పలు విద్యాసంస్థలు, కేటాయించిన నిధుల గురించి వివరిస్తున్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి చేసిన పనుల గురించి క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని బీజేపీ పక్కగా ప్లాన్ చేస్తోంది.
ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ్టి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 30వరకు 'మహాజన్ సంపర్క్ అభియాన్'లో భాగంగా నిర్వహించే సభల్లో పాల్గొనున్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో సంజయ్ పర్యటించనున్నారు. గురువారం భూపాలపల్లి, శుక్రవారం జుక్కల్, 24న రామగుండంలో పర్యటించనున్నారు. ఈనెల 25న నాగర్ కర్నూల్లో నిర్వహించే జేపీ నడ్డా బహిరంగ సభల్లో సంజయ్ పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
జులైలో రథయాత్రలు: 26వ తేదీన నల్గొండ, 27న మలక్ పేట, 28న ఇబ్రహీం పట్నం, 29న మక్తల్, 30న బోధన్ అసెంబ్లీ నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఇలా జిల్లాలా వారిగా పర్యటించి స్థానిక నేతలను కలుస్తూ.. సభల్లో పాల్గొంటారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, తెలంగాణకు కేటాయించిన నిధులను వివరించనున్నారు. కేసీఆర్ సర్కారు అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిజయజేస్తారు. స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయనున్నారు. జులై నెలలో ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో రథయాత్రలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది.
BJP Development works in Telangana : తెలంగాణలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులను గత వారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. వాటి వివరాలను ప్రకటించారు. రాష్ట్రాల పన్నుల వాటా పంపిణీ 32 శాతం 42శాతంకి పెంచినట్లు పేర్కొన్నారు. 2004-14 ఏళ్ల కాలంలో రూ.18.50లక్షల కోట్ల నిధులు రాష్ట్రాలకు ఇస్తే .. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక 2014-23 వరకు రూ.69.60లక్షల కోట్ల నిధులు రాష్ట్రాలకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం 3.75 రెట్లు ఎక్కువ నిధులు రాష్ట్రాలకు ఇచ్చిందని గుర్తు చేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో పన్నుల వాటా రూపంలో తెలంగాణకు రూ.1.60లక్షల కోట్లు అందించినట్లు మంత్రి వివరించారు.
ఇవీ చదవండి: