Bandi Sanjay: పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుందన్నారు. ఈ మేరకు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రజల అవసరాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం సంతోషకరమైన విషయమన్నారు. తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ.లక్ష కోట్ల మేరకు తగ్గే అవకాశమున్నప్పటికీ ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
"ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించడం సంతోషించదగ్గ విషయం. దీనివల్ల దేశంలోని 9 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. తాజా నిర్ణయం వల్ల ప్రత్యక్షంగా కేంద్రంపై రూ.6,100 కోట్ల మేర భారం పడుతున్నప్పటికీ పేదల సంక్షేమం కోసం కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో ఎరువులు ధరలు పెరుగుతున్నప్పటికీ... ఆ భారాన్ని రాయితీ రూపంలో భరించేందుకు ప్రస్తుత బడ్జెట్ లో 1 లక్షా 5 వేల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం.. అవసరమైతే అదనంగా మరో రూ.లక్షా 10 వేల కోట్లను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించం గొప్ప నిర్ణయం. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం గతంలోనూ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. వరుసగా రెండోసారి కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్‌పై పన్నును తగ్గించకపోవడం దారుణం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ర ప్రభుత్వం కూడా వెంటనే వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రజలకు మరింత ఉపశమనం కలిగించాలి. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అవసరమైతే వ్యాట్ తగ్గించే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మోదీ పేరు వింటేనే కేసీఆర్ వణికిపోతున్నారు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు వింటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ గజ గజ వణికిపోతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అందుకే ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిసి ముఖం చెల్లక కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. దిల్లీలో చనిపోయిన రైతులకు కేసీఆర్ ఆర్థిక సాయం చేయడంపై తీవ్రంగా బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తెరాస పాలనలో తెలంగాణలో వేలాది మంది రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా చివరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. అకాల వర్షాలతో పంట నష్టపోయి వడ్ల కుప్పలపై పడి రైతులు గుండె పగిలి చనిపోయారని తెలిపారు. ఆయా కుటుంబాలకు ఏనాడూ నయాపైసా సాయం చేయని కేసీఆర్.. పబ్లిసిటీ కోసం ఇతర రాష్ట్రాల రైతులకు ఆర్థిక సాయం చేస్తుండటం సిగ్గు చేటన్నారు. సీఎం తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.