Bandi Sanjay Tweet On BRS: కల్వకుంట్లది కచరా పాలన అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బీజేపీ మంత్రం " నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్ట్స్.. ఫ్యామిలీ లాస్ట్" కాని బీఆర్ఎస్ నినాదం మాత్రం" కుటుంబం ఫస్ట్.. పార్టీ నెక్ట్స్.. పీపుల్స్ లాస్ట్"అని సెటైర్లు వేశారు. ఇది కవిత, కేసీఆర్, కేటీఆర్ కచారా పాలనకి నమూనా అని ఎద్దేవా చేశారు.
గత తొమ్మిదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ధనవంతులు అయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, నిరుద్యోగులు మాత్రం కష్టాల ఊబిలో కొట్టుమిట్టు లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో మాత్రమే.. సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బండి సంజయ్ అన్నారు.
గతంలో కేటీఆర్ vs బండి సంజయ్: అలాగే గతంలో కూడా కేటీఆర్, బండి సంజయ్ మధ్య తీవ్రస్థాయిలో ట్వీట్ల వార్ జరిగింది. ఉగాది పండగ రోజున అందరూ ఫెస్టివల్ మూడ్‌లో ఉంటే వీరిరువురు మాత్రం ట్విటర్ వేదికగా తిట్ల పంచాంగాన్ని చదివారు. ఆదాయం అదానీకి, వ్యయం జనాలకు, బ్యాంకులకు అంటూ రాజపూజ్యం గుజరాతీలకు, అవమానం నెహ్రూకి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అందుకు సమాధానంగా బండి సంజయ్ ఎదురు సమాధానం ఇస్తూ.. ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి.. వ్యయం రాష్ట్ర ప్రజలకు అంటూ.. రాజపూజ్యం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు.. అవమానం ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు అంటూ ఒకరినొకరు పంచాంగం చెప్పే రీతిలో తిట్టుకున్నారు.
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు: తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో బీజేపీ ముందుకు పావులు కదుపుతుంది. అందుకు తగ్గట్లుగానే ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చిన పార్టీ కండువా కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలోని అనేక సమస్యలపై బీజేపీ పోరాడుతుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయాన్ని చాలా సీరియస్ తీసుకొని.. ఏకంగా మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని నినదిస్తూ.. శనివారం వరంగల్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. వారు చేసిన అక్రమాలను ప్రజల వద్దకు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దిల్లీ లిక్కర్ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై కూడా ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ తమ రాజకీయాలకు పదును పెడుతున్నారు.
ఇవీ చదవండి: