ప్రభుత్వ వైఫల్యాలే నాగులు మరణానికి కారణామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం... ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం వల్లే ఇంకా ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని మండిపడ్డారు. నాగులు మృతి చాలా దురదృష్టకరమని.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే... నేడు బతకలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
హైదరాబాద్ రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యా ప్రయత్నం చేసిన నాగులు మరణం ఆయన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన బండి సంజయ్... నేడు తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితికి నాగులు మరణం అద్దం పడుతుందని పేర్కొన్నారు. అస్తవ్యస్త విధానాలు, దుబారా, క్రమశిక్షణా రాహిత్యంతో ధనిక రాష్ట్రాన్ని కాస్తా... అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందని బండి సంజయ్ దుయ్యబట్టారు.