తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay Comments: 'కేసీఆర్ అలా మాట్లాడటం అత్యంత దురదృష్టకరం' - Telangana Bjp News

Bandi Sanjay Comments: గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గ్రామపంచాయతీలకు కేంద్రం నిధుల ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : May 19, 2022, 6:12 PM IST

Bandi Sanjay Comments: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్... చిల్లర వ్యవహారంగా తప్పుపట్టడం అత్యంత దురదృష్టకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిధులు, విధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశమన్న విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి మేరకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తూ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తోందని స్పష్టం చేశారు.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా... ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు సహా వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్​ది చిల్లర బుద్దికాక ఏమనాలన్నారు.

అవి వాస్తవాలు కాదా?: గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ గ్రామాలను పూర్తిగా నీరుగారుస్తున్నది కేసీఆర్ కాదా? కమీషన్ల కోసం ట్రాక్టర్లు కొంటున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. కేంద్ర నిధులను జీతాలకు మళ్లిస్తోంది నిజం కాదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేతగానితనం వల్ల సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని అప్పుల పాలై ఉపాధి కూలీలుగా, వాచ్​మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నది వాస్తవం కాదా అన్నారు.

గొప్ప నాయకుడు మోదీ:జాతీయ పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు ఏటా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కేసీఆర్‌ మాత్రం ఫాంహౌజ్​కే పరిమితమయ్యారని సంజయ్ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా కశ్మీర్ వ్యాలీలోని ఓ కుగ్రామానికి వెళ్లి సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని పంచాయతీల ప్రాముఖ్యతను చాటిచెప్పిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఆధ్వర్యంలో పాలన కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఇదీ చదవండి:


ABOUT THE AUTHOR

...view details