Bandi Sanjay Comments on Cm Kcr: ఉద్యోగుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్... వ్యవహరిస్తున్న తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు అల్లాడిపోతుంటే... ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. తక్షణమే 317 జీవోపై పున:సమీక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన భాజపా ఉద్యమిస్తుందని ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ గుర్తుకు రాలేదా..?
317 జీవో పేరుతో సీఎం కేసీఆర్... వ్యవహరిస్తున్న తీరువల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలన్నీ ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగులంతా స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల మధ్య సీనియర్, జూనియర్ పేరుతో కొట్లాటలు పెడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రజా, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై పోరాటాలు చేస్తుంటే‘ఒమిక్రాన్’ పేరుతో సభలు, ర్యాలీలు నిషేధించిన ముఖ్యమంత్రికి తెల్లవార్లు బార్లు, పబ్ లకు అనుమతిచ్చేటప్పుడు వైరస్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.