ఎమ్మెల్యేల ఎర కేసు విషయంలో కేసీఆర్ తప్పు చేయనప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయడానికి భయపడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మర్రిగూడెంలో బండి సంజయ్ మాట్లాడారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సీబీఐ విచారణను నిలిపివేస్తూ ఇచ్చిన జీవోను 24 గంటల్లోగా ప్రజలకు తెలియజేయాలని.. కానీ నిన్న కోర్టులో సమాధానం చెప్పే వరకు బయట ప్రపంచానికి తెలియలేదని బండి మండిపడ్డారు. భాజపా పిటిషన్ వేసేంత వరకు ఈ సీబీఐ ఉపసంహరణ విషయం బయటకు రాలేదని ఆరోపించారు. తప్పు చేశారు కాబట్టే యాదాద్రికి ముఖ్యమంత్రి రావడం లేదని ఎద్దేవా చేశారు. తప్పు చేయనప్పుడు ఎందుకు సీబీఐ విచారణకు అడ్డుపడుతున్నారని నిలదీశారు.
సీబీఐ విచారణను తెలంగాణలో నిలిపివేస్తూ ఇచ్చిన జీవోను 30/08/2022న జారీ చేశారు. అది ఎందుకంటే కేసీఆర్ బిడ్డ లిక్కర్ వ్యవహారంలో ఇరుక్కున్న సమయంలో రద్దు చేయడం జరిగింది. ఈ జీవోను అమలు చేసినప్పుడు 24 గంటల్లోపు ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు ఈ కేసు విషయంలో కోర్టులో తెలిపారు. అప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకు సీబీఐ అంటే భయం. నిన్న భాజపా మీద ఆరోపణలు చేశావు. మేము తప్పు చేయలేదు. అందుకే యాదాద్రికి రమ్మన్నాము. రాలేదు. నీ పోలీసుల ద్వారా విచారణ చేయమన్నా చేయలేదు. సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపమన్నాము. చేయించడం లేదు. సీబీఐ విచారణ జరపమన్నా.. దానికీ ఒప్పుకోలేదు. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు