Bandi Sanjay on Vizag Steel Plant Bidding: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ మరోసారి తనదైన శైలిలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా.. కోతల రాయుడు కేసీఆర్ పారిపోయారని ఆయన ధ్వజమెత్తారు. బయ్యారం స్టీల్, నిజాం షుగర్స్, రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్దరణపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని సంజయ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ గుండెలు గుభేల్ అంటున్నాయి: కేసీఆర్ చెప్పేవన్నీ కోతలేనని మరోసారి తేలిపోయిందని బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోందన్నారు. సీఎం చేష్టలతో తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ మాటలన్నీ కోతలేనని తేలిపోయిందని బండి విమర్శించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. బీజేపీ పోరాటాలతో బీఆర్ఎస్ గుండెలు గుభేల్ అంటున్నాయన్నారు. ఈ నెల 23న నిర్వహించే చేవెళ్ల బహిరంగ సభను.. విజయవంతం చేసి సత్తా చాటుతామని పేర్కొన్నారు. చేవెళ్ల బహిరంగ సభకు 'విజయ సంకల్ప సభ'గా నామకరణం చేశామని బండి సంజయ్ తెలిపారు.
'విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పారిపోయారు. పోటుగాడిలా వెళ్తానన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు పైసలు లేవనంటున్నారు. కేసీఆర్‌ను చూసి దేశం మొత్తం నవ్వుకుంటోంది. బయ్యారం స్టీల్, నిజాం షుగర్స్, రేయాన్ ఫ్యాక్టరీలపై మాట తప్పారు. చెప్పింది ఒక్కటీ కేసీఆర్ చేయడు. కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణను ఇలాంటి మూర్ఖుడి చేతిలో పెట్టి మనం మోసపోతున్నాం.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు