BJP petition in HC on Bandi sanjay arrest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేయడంతో రాష్ట్రంలో ఒక్క సారిగా రాజకీయ వేడి మొదలైంది. ఆయన అరెస్టును నిరసిస్తూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సంజయ్ అరెస్టును రాష్ట్ర బీజేపీ పెద్దలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కారణం చెప్పకుండా సంజయ్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ అరెస్టును ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. బీఆర్ఎస్ కాలం చెల్లిందని.. ప్రజలు త్వరలోనే ఆ పార్టీని ఇంటికి పంపిస్తారని జోస్యం చెప్పారు
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బండి అరెస్టును బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోశ్ అన్నారు. పాలన చేతగాక సంజయ్‌ను అరెస్టు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని పేర్కొన్నారు.
రఘునందన్ అరెస్టు: మరోవైపు బండి సంజయ్‌ను పరామర్శించేందుకు బొమ్మలరామారం పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు తీవ్ర వాగ్వాదం జరగగా.. ఆయన్ను అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించడం లేదని ఆరోపించిన ఆయన.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని ఆరోపించారు.
బండిసంజయ్‌ను ఎందుకు అరెస్టు చేశారోచె ప్పకుండా.. నిర్భందించడం దారుణమని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిజాం లాంటి నియంతనే తెలంగాణ సమాజం ఎదిరించిందని.. కేసీఆర్ పెద్ద లెక్క కాదని విమర్శించారు. పేపర్ లీకేజీలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారు. బండి సంజయ్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.