Bandi Sanjay Angry With BRS And Congress: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు తోడుగా సూది తబ్బలంలా.. ఇంకా మరికొన్ని పార్టీలు పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ కొంత మంది నేతలు పాల్గొన్నారు.
ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలే బహిరంగంగా చెప్పుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ఇదే విషయంపై గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇప్పుడు జానారెడ్డి చెప్పారని అన్నారు. ఎవరు ఎంతమందితో కలిసి పోటీ చేసినా సరే.. బీజేపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.
షర్మిల ఫోన్ చేసిన మాట వాస్తవమే: నిరుద్యోగుల సమస్యపై ప్రతిపక్షాలతో కలిసి పని చేయాలని చెప్పి వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనకు ఫోన్ చేసింది వాస్తవమే అని చెప్పారు. పార్టీతో చర్చించిన తర్వాతనే ఉమ్మడి కార్యాచరణకు మద్దతు ఇస్తామని ఆమెతో చెప్పానన్నారు. కాంగ్రెస్ ఉంటే తాము పోరాటానికి రాలేమని చెప్పానని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. ఉచిత యూరియా ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద ఉన్న ఆరోపణలు అన్నీ తమకు తెలుసునని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి.. మహారాష్ట్ర రైతులను తీసుకుని వచ్చి బీఆర్ఎస్లో చేర్చుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.