గ్రేటర్ ఎన్నికల్లో 18 ఏళ్ల తర్వాత బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఇన్నేళ్లుగా జరిగిన ఎన్నికల్లో ఈవీఎంపై ఓటేసిన నగరవాసికి.. బ్యాలెట్ పెట్టెలు కొత్తగా కనిపిస్తాయి. కాబట్టి ఓటరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గందరగోళానికి గురై ఓటేస్తే స్టాంపు ముద్ర రెండు గుర్తులపై పడి ఓటు వృథా అయ్యే అవకాశముందని గుర్తుచేస్తున్నారు. ఈవీఎంల లెక్కింపుతో పోలిస్తే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిదానంగా ఉంటుంది. అంచనా ప్రకారం గతంలో మాదిరి పోలింగ్ శాతం 50 శాతానికి లోపు ఉంటే 150 డివిజన్ల ఫలితాలు రాత్రి 8గంటల్లోపు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
లెక్కింపు ఇలా..
ఓటింగ్ తరువాత ఎన్నికల అధికారి బ్యాలెట్ పెట్టెలకు ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి ఒక సంఖ్య రాస్తారు. వాటిని భద్రపరిచి సర్కిళ్లవారీగా ఎంపిక చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తారు. లెక్కింపు రోజున ఉదయం 6గంటల నుంచే బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ హాళ్లకు తరలిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి డివిజన్‌కు ప్రత్యేక కౌంటింగ్ హాల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఒక్కో కౌంటింగ్ హాల్‌కు రెండు వరుసల్లో ఏడేసి చొప్పున మొత్తం 14 లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. వాటికి చివరన డివిజన్ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) టేబుల్ ఉంటుంది. ఆర్వో వద్ద పోటీ చేసిన అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు క్రమసంఖ్యలో కుర్చీలు కేటాయిస్తారు. లెక్కింపు టేబుళ్లకు ఎదురుగా జారీ ఏర్పాటు చేసి అవతలి వైపున పార్టీల వారీగా కౌంటింగ్ ఏజెంట్లు కూర్చునేందుకు ఆర్వో అనుమతిస్తారు. వీళ్లని మినహా ఎవరినీ లెక్కింపు కేంద్రంలోకి అనుమతించరు.
మొదట తపాల ఓట్ల లెక్కింపు..
తపాల ఓట్లను ఆర్వో టేబుల్‌పై ఉంచిన డబ్బాలో వేస్తారు. వాటిపై ఉండే ముద్రలను చూడకుండా ప్రతి 25 బ్యాలెట్ పేపర్లను ఓ కట్టగా కడతారు. అనంతరం అభ్యర్థుల వారీగా తపాల ఓట్లను లెక్కించి తుది సంఖ్యలను ఆర్వో ప్రకటిస్తారు. అదే సమయంలో సిబ్బంది బ్యాలెట్ పెట్టెలను టేబుళ్ల వద్దకు తీసుకొస్తారు. దాని మూతిపై ఎన్నిక రోజు వేసిన సీలును, రాసిన సంఖ్యను పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు ధ్రువీకరించాలి.