దేవరయాంజల్ భూ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కమిటీ వేస్తే.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి భుజాలు తడుముకుంటున్నారని అన్నారు ప్రభుత్వ విప్ బాల్కసుమన్. తన నిజ స్వరూపం బయటపడుతుందని భయపడుతున్నారని విమర్శించారు. బినామీల వ్యవహారం బయటకు వస్తుందేమోనని గుబులు చెందుతున్నారని ఆరోపించారు.
‘భూ అక్రమాలపై ఐఏఎస్ అధికారులతో సీఎం కేసీఆర్ విచారణ కమిటీ వేశారంటే.. ఆయన చిత్తశుద్ధి ఎంటో అందరూ అర్థం చేసుకోవాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిని సమర్థించాల్సింది పోయి.. రేవంత్ బట్టకాల్చి మీదేస్తున్నారు. విచారణలో తన అక్రమాలు కూడా బయటపడతాయనే భయం పట్టుకుంది ఆయనకు. ఏ విషయమైనా, ఎవరి సంగతైనా ప్రజాక్షేత్రంలో బయటపడడం ఖాయం. ఏవో రెండు కాగితాలు తెచ్చి అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దల మీద మాట్లాడతానంటే కుదరదు. దొంగే దొంగ అన్నట్టుగా మాట్లాడితే నడవదు. చీకటి దందాలు చేస్తాం.. విచారణ వద్దని రేవంత్ చెబుతున్నారు. గురి విందలా వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడినా చెల్లుతుందనుకోవద్దు. ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకోవాలి. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి’