ఎంతో పేరున్న బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈసారి రికార్డు స్థాయిలో 17 లక్షల 60 వేల రూపాయల ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను రాంరెడ్డి కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు 'కొలను' కుటుంబ సభ్యులే బాలాపూర్ గణేశుడి లడ్డూని సొంతం చేసుకున్నారు. వేలంపాట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హాజరయ్యారు. బంగారు పూతతో ఉన్న వెండి పళ్లెంలోని 21 కిలోల పరిమాణం ఉన్న లడ్డూను రాంరెడ్డికి అందజేశారు.
బాలాపూర్ లడ్డూ గతేడాది 16 లక్షల 60 వేల రూపాయలు పలికింది. ఈ ఏడాది వేలంపాట కోసం 19 మంది పోటీపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లూరు వాసి గుండాల వంశీకృష్ణారెడ్డి కూడా వేలంలో పాల్గొనడం విశేషం. పోటీపోటీగా సాగిన పాటలో గతేడాది కంటే లక్ష రూపాయల ధర ఎక్కువకు వేలం ఖరారైంది.