Balanagar Division People Blocked BJP Leaders: బస్తీలో పాదయాత్ర పేరుతో హైదరాబాద్ కూకట్‌పల్లిలోని బాలానగర్ డివిజన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీశ్ రెడ్డి పాదయాత్ర చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం ఇంఛార్జ్ మాధవరం కాంతారావుతో కలిసి బస్తీలో పర్యటించారు. ఈ క్రమంలో వీరిపై స్థానిక ప్రజలు తిరగబడ్డారు. 40 ఏళ్లుగా ఐడీపీఎల్ బస్తీల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాము గుడిసెలు ఖాళీ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. తమను ఇళ్ల నుంచి తరిమేసేవాళ్లు తమ బస్తీలోకి రావొద్దంటూ అడ్డుకున్నారు.
దాదాపు 40 ఏళ్ల నుంచి బాలానగర్ డివిజన్లోని ఇంద్రానగర్‌లో 1200 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తమను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు మద్దతుగా నిలిచారని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తమకు మౌలిక సదుపాయాలు కల్పించారని వెల్లడించారు. తమ గుడిసెలను అధికారులు తొలగించాలని చూస్తే టీఆర్ఎస్ సర్కార్ అండగా నిలిచిందని చెప్పారు.