Balakrishna pays tribute to NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ అంజలి ఘటించారు. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారన్న బాలకృష్ణ... తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ను మరచిపోలేరని పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మాట తప్పని ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమన్న బాలకృష్ణ... తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు.
'సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారు. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లెజెండ్. ఆయన పట్టుదల, అకుంఠిత దీక్ష, మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిత్వం మనందరికీ ఆదర్శం. తెలుగు జాతి ముద్దుబిడ్డ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు. ఆయన మనసు మకరందం. ఆయన అభిమానం అనంతం. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ను మరచిపోలేరు.'
-నందమూరి బాలకృష్ణ
సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చరిత్ర మరువలేనిదని... అన్ని పార్టీలను ఏకం చేసి.. జాతీయ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. బడుగు బలహీన వర్గాల, పీడిత ప్రజలకు పదవులు ఇచ్చారని తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్టీఆర్ 610 జీవో అమలు చేశారని.. ఇప్పుడు అదే తెలంగాణలో ఉద్యోగాల కోసం ఆందోళనలు జరుగుతున్నాయని బాలకృష్ణ అన్నారు.