Bajrangdal Protest in Telangana : కర్ణాటకలో అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై ఆ సంస్థ కార్యకర్తలు భగ్గుమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలు 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ నిరసనలకు దిగారు. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు భజరంగ్‌దళ్ కార్యకర్తలు విడతల వారీగా భారీగా తరలివచ్చారు. అదే సమయంలో ప్రతిగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించగా.. ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో గాంధీభవన్ పరిసరాలు మార్మోగాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భజ్‌రంగ్‌దళ్ నిరసనలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లక్ష్మణ్, కిషన్ రెడ్డి తమ వద్దకు వస్తే కలిసి హనుమాన్ చాలీసా చదువుతామని చమత్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భజరంగ్‌దళ్ కార్యకర్తలు హనుమాన్ చాలీసా పఠనానికి యత్నించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిరసనకారులను పోలీసులు అడ్డున్నారు.