Bail Granted to Other Two Accused in TSPSC Paper Leak Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు సిట్ విచారణ వేగవంతం చేయగా మరోవైపు ఈ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు ఈనెల 12న 8మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా.. మరో ముగ్గురు నిందితులు అదే రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ ఇవాళ్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
మరో ఇద్దరికి బెయిల్ మంజూరు : తాజాగా రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్‌లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సిట్ అధికారులకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సిట్ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం... ముగ్గురిలో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. ఏ4 డాక్యా నాయక్, ఏ5 రాజేశ్వర్ నాయక్‌లకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మూడు గంటల వరకు సిట్ కార్యాలయంలో హాజరుకావాలని షరతు విధించింది. అలాగే విదేశాలకు వెళ్లొద్దని, పాస్‌పోర్టును అధికారులకు అప్పగించాలన్న కోర్టు.. రూ.50 వేల పూచీకత్తుతో కూడిన రెండు జామీనులు సమర్పించాలని ఆదేశించింది.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్, సోదరుడు రాజేశ్వర్ నాయక్ ఏఈ ప్రశ్నాపత్రాలను విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ప్రవీణ్ నుంచి ప్రశ్నపత్రాలు తీసుకున్న రేణుక, తన భర్త, సోదరుడికి ఇవ్వడంతో వాళ్లు బేరం పెట్టినట్లు అధికారులు గుర్తించారు. మార్చి 13వ తేదీన డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్ రెడ్డిలు సైతం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
మొత్తం 13 మందికి బెయిల్ మంజూరు : ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు ఇప్పటికే 11మందికి బెయిల్ మంజూరు చేయగా వీరితో కలిపి ఆ సంఖ్య 13కు చేరింది. ఇందులో ఏ3 రేణుకతో పాటు మిగతా 10మంది నిందితులున్నారు. ఈ కేసులో సిట్ అధికారులు మొత్తం 27మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 12న టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో 8మందికి షరతులతో... బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్కరు 50వేలతో కూడిన రెండు పూచీకత్తులు సమర్పించాలని, నిర్దేశించిన తేదీల్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లరాదని... కోర్టు ఆదేశించింది. ఈ షరతులతో నీలేష్ నాయక్, కెతావత్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్, షమీమ్, సురేష్, మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో.. రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డిలకు నాంపల్లి కోర్టు ఇప్పటికే బెయిలు ఇవ్వగా... వారు జైలు నుంచి విడుదలయ్యారు.
ఇవీ చదవండి: