చదువుకు దూరంగా ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు.. సర్కారీ బడుల్లో విద్యార్థులను పెంచేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. జూన్ 4 నుంచి జూన్ 12వరకు పండగ వాతావరణం ప్రతిబింబించేలా 'ఆచార్య జయశంకర్ బడిబాట' కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. దీని లక్ష్యాలు, నిర్వహణ తీరుపై విధివిధానాలు వివరిస్తూ డీఈఓలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు పంపించారు.
ఇంటింటికీ ప్రచారం...
జూన్ 1 నుంచి జూన్ 3 వరకు కలెక్టర్లు బడిబాట సమన్వయ సమావేశం నిర్వహించి ప్రణాళిక రూపొందిస్తారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఉదయం 7 గంటల నుంచి 11 వరకు ఇంటింటికీ తిరిగి పిల్లలు, తల్లిదండ్రులను కలిసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరిగా చదువు చెప్పరని... వసతులు ఉండవన్న భావనను తొలగించాలని నిర్ణయించారు.
కరపత్రాల పంపిణీ...
ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాల పంపిణీ, రెండు జతల యునిఫాం ఇస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బడుల ప్రత్యేకతలు, సాధించిన విజయాలు వివరిస్తూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు వెయ్యి రూపాయలు మంజూరు చేయాలని డీఈఓలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు.