YSRTP: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని రిజిస్ట్రేషన్ చేయలేదని భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో ప్రచారం జరుగుతుంది. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మహబూబ్ బాషా సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారానికి భారత ఎన్నికల సంఘం ఈ మేరకు రాత పూర్వకంగా సమాధానమిచ్చినట్లు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. ఈ విషయం వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతల దృష్టికి కూడా వచ్చింది.
గతంలో వైఎస్సార్టీపీ పార్టీ పేరుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్న వైఎస్సార్ పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వారు షర్మిల కొత్త పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్టీపీ పేరు తమ పార్టీ పేరును పోలి ఉందని అన్న వైఎస్సార్ పార్టీ అధినేత మహబూబ్ బాషా నవంబర్లో ఈసీకి ఫిర్యాదు చేశారు. బాషా ఫిర్యాదు స్వీకరించిన ఈసీ.. వైఎస్సార్టీపీ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది.