తెలంగాణ

telangana

ETV Bharat / state

Bio Reform Company: 'ఈ అంకుర సంస్థ ఏకో ఫ్రెండ్లీ బ్యాగ్​లకు చాలా చరిత్రే ఉంది' - అజర్​

Bio Reform Startup Company In Hhyderabad: రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్య భూమండలంపై ఉన్న జనాభాకు పెను సవాళ్లు విసురుతున్నాయి. ఆ కారణంగా కాలుష్యం, ఆరోగ్య సమస్యలు విపరితంగా పెరిగి పోతున్నాయి. ఈ సమస్యలు అధిగమించాలని 2019లో ప్రధాని మోదీ ప్లాస్టిక్‌ ఫ్రీ భారత్‌ పిలుపు నిచ్చారు. అది చూసి ప్రేరణ పొందిన ఓ యువకుడు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అదే బయో రిఫాం. పర్యవరణానికి మేలు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌ యువకుడు నెలకొల్పిన ఆ అంకుర సంస్థ దిగ్విజయంగా దూసుకెళ్తోంది. అతడి విజయ రహస్యం ఏంటి...? ఇప్పుడు చూద్దాం.

Bio Reform
Bio Reform

By

Published : Apr 20, 2023, 4:59 PM IST

భారత్​లో తొలి గ్రీన్​ ఇంజినీర్​నే లక్ష్యంగా.. ప్లాస్టిక్​ రహిత బ్యాగ్​లు తయారీ

Bio Reform Startup Company In Hhyderabad: పూర్తిగా ప్లాస్టిక్‌తో నిండిపోతున్న ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు ఈ యువకుడు. అందుకు బయో రిఫాం పేరుతో ఓ అంకురంసంస్థ స్థాపించాడు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని కొత్త వ్యాపారం ప్రారంభించాడు. సక్సెస్‌ఫుల్‌గా ప్లాస్టిక్‌ ఫ్రీ బ్యాగుల విక్రయిస్తూ ఈ యువ వ్యాపారవేత్త అజర్​ అందరి మన్ననలూ పొందుతున్నాడు.

హైదరాబాద్​కు చెందిన అజర్​ సివిల్​ ఇంజినీరింగ్​ చదువుకున్నాడు. లాక్​డౌన్​ సమయంలో అంతా ఏదొక కొత్త కోర్సులు చేస్తూ.. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్న సమయంలో తను మాత్రం ప్రపంచంలో భయంకరమైన సమస్యలపై రీసెర్చ్​ చేశాడు. వాటిలో ప్లాస్టిక్​ కాలుష్యం సమస్య తనని తీవ్ర ఆలోచనలో పడేసింది. ఎలా అయినా.. ఇందుకు తగిన పరిష్కారం కనుక్కోవాలని తన ప్రయత్నం కొనసాగించాడు.

మొక్కజొన్న పిండితో క్యారీ బ్యాగులు: 2019లో ప్రధాని మోదీ ప్లాస్టిక్‌ ఫ్రీ భారత్‌పై ఇచ్చిన ప్రసంగం అజర్‌ను ఎంతో ఆకట్టుకుంది. రోజు వారి వాడకంలో ఉన్న ప్లాస్టిక్‌ బ్యాగుల వాడకం తగ్గిస్తే.. ప్లాస్టిక్‌ కాలుష్యం తగ్గుతుందని బలంగా నమ్మాడు. మోదీ ప్రసంగంతో ఊపిరి పోసుకున్న తన ఆలోచనకు లాక్‌ డౌన్ సమయంలో పదును పెట్టాడు. బయోడీగ్రేడెబుల్‌ బ్యాగ్‌లు తయారీ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. రీసెర్చ్‌ చేసి తెలుసుకున్న విషయాలతో వివిధ రకాల ప్రయోగాలు చేసి పూర్తిగా ప్లాస్టిక్‌ ఫ్రీ బ్యాగ్‌ తయారు చేయగలిగాడు. ప్లాస్టిక్‌ ఫ్రీ భారత్​పై అప్పటికే వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎలాంటి సమస్యకైనా.. అవగాహన ఉన్నా.. ప్రత్యామ్నాయం లేకపోతే పరిష్కారం దొరకదని అజర్‌ నమ్మాడు. ఫలితంగా మెుక్క జొన్న పిండితో రోజు వారి వాడకంలో ఉపయోగించే క్యారీ బ్యాగులు తయారు చేయచ్చని తెలుసుకున్నాడు.

అన్నీతానై.. అంకుర సంస్థ ప్రారంభం: అన్ని ప్రయోగాల తర్వాత ప్లాస్టిక్‌ ఫ్రీ కోసం బయో రిఫాం అంకురసంస్థను అజర్​ ప్రారంభించాడు. వ్యవస్థాపకుడు, తయారీదారు, ప్రమోటర్‌ అన్నీ తనే అయ్యి ఆలోచనను.. అంకురం రూపంలో ముందుకు నడిపించాడు. నగరంలో ప్రముఖ సంస్థలతో, ఫుడ్‌ ఔట్‌లెట్‌లతో ఒప్పందం చేసుకుని.. తన అంకురాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. సివిల్‌ ఇంజినీరింగ్‌ చేస్తూ కూడా.. కాలేజీ అయిన తర్వాత ఖాళీ సమయంలో.. బయో రిఫాంకు సంబంధించి డోర్‌ టు డోర్‌ మార్కెటింగ్‌ చేస్తూ.. నేడు నగరంలో ప్రముఖ ఔట్‌లెట్‌లకు ప్లాస్టిక్‌ ఫ్రీ కార్న్‌ బ్యాగులు అందిస్తున్నాడు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఇన్‌క్యుబేటర్‌లలో ఒకటైన అడ్వెంచర్‌ పార్కులో.. అంకురాన్ని ప్రారంభించి ఇప్పుడు 10 మంది ఉన్న టీంను నిర్మించుకున్నాడు.

"బయో రిఫాం ఆలోచన 2019-2020లో వచ్చింది. అది లాక్​డౌన్​ సమయం. కాలేజీలు, తరగతులు లేవు. అలా సమస్యల గుర్తించి చర్చించే అవకాశం దక్కింది. అదే సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియో వచ్చింది. అందులో 2025కల్లా ఇండియా ప్లాస్టిక్​ రహితదేశంగా ఉంటుందని చెప్పారు. అది నన్ను ఆలోచనలో పడేసింది. పౌరుడిగా నా బాధ్యతను నేను నేరవేర్చాలనుకున్నాను. అందులో భాగమే ఈ బయో రిఫాం." - అజర్‌, బయో రిఫాం వ్యవస్థాపకుడు

భారత్​లో తొలి గ్రీన్​ ఇంజినీర్​నే కల: జీడిమెట్లలో తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుని.. పూర్తిగా బయో డిగ్రేడెబుల్‌ క్యారీ బ్యాగులను అజర్​ తయారు చేస్తున్నాడు. ఇన్​క్యూబేటర్​ నుంచి 30 శాతం పెట్టుబడులు సహాయం అందుతుండగా.. మిగిలిన 70 శాతం పెట్టుబడులు తన స్నేహితుడితో కలిసి పెట్టాడు. ఇక్కడితో ఆగిపోకుండా.. మెడికల్‌ ఫీల్డ్‌లో కూడా తన వ్యాపారాన్ని విస్తరిస్తానంటున్నాడు. ప్రపంచంలో అతి పెద్ద సమస్యలలో ఒకటి అయిన ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్న హైదరాబాద్‌ యువకుడు.. ప్రస్తుతం అందరి మన్ననలు పొందుతున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని సస్టైనబుల్​ ప్రోడక్ట్స్‌తో ముందుకు వస్తూ.. భారత్‌లోనే తొలిగ్రీన్‌ ఇంజినీర్‌గా పేరు తెచ్చు కోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ 22ఏళ్ల అజర్​ చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details