దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ "ఆజాదీ కా అమృత్" మహోత్సవాల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్... రాష్ట్రంలో ఉత్సవాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ ఉత్సవాలను రాష్ట్రంలోనూ ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు 75 వారాలపాటు జరపాలని సూచించారు. ఇందుకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని నియమించారు.
ఈనెల 12న ఆరంభ కార్యక్రమం..
ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 12న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్, వరంగల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆరంభ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్‌లో తాను పాల్గొననున్నట్టు తెలిపారు. వరంగల్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే కార్యక్రమంలో జాతీయ పతాకావిష్కరణ, పోలీస్ మార్చ్, దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు జరపాలని సీఎం సూచించారు.