తెలంగాణ

telangana

'ఆనందయ్య ఔషధంపై 5 రోజుల్లో తుది నివేదిక'

By

Published : May 24, 2021, 7:32 PM IST

ఆనందయ్య ఔషధంలో హానికరమైన పదార్థాలు ఏమీ లేవన్నారు ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు. సీఎం జగన్​తో భేటీ అయిన ఆ శాఖ అధికారులు.. పలు అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. క్లినికల్ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పగలమని స్పష్టం చేశారు.

anandaiah
ఆనందయ్య ఔషధం

ఆనందయ్య ఔషధం

ఆనందయ్య ఔషధంపై ముఖ్యమంత్రి జగన్​తో ఆయుష్ అధికారులు చర్చించారు. ఔషధంపై ఐదారు రోజుల్లో తుది నివేదిక వస్తుందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. చట్టపరంగా మాత్రం ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమని స్పష్టం చేశారు. క్లినికల్‌ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పగలమన్న ఆయన.. ఔషధంలో వాడే మూలికలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నవేనని చెప్పారు. ఆనందయ్య ఔషధంలో హానికరమైన పదార్థాలు ఏమీ లేవని వెల్లడించారు. ఆనందయ్య ఔషధంతో లబ్ధి జరిగిందని ఎక్కువ మంది చెబుతున్నారని చెప్పారు.

'ఆనందయ్య 35 ఏళ్లుగా ఔషధం ఇస్తున్నారు. నోటి ద్వారా నాలుగు రకాల మందులు, కళ్లలో డ్రాప్స్‌ ఇలా ఐదు రకాలుగా మందులు ఇస్తున్నారు. ఆయన 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె ఇలా 18 రకాల పదార్థాలను 5 రకాల మందుల్లో వాడుతున్నారు. అన్నీ కూడా సహజంగా దొరికే పదార్థాలు. వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదు. మందుల తయారీ విధానాన్ని మొత్తం మాకు చూపించారు. ఫార్ములా కూడా చెప్పారు. ఆ మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపాం. కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయి, ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకా ఈ మందు శాంపిళ్లను ‘సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ స్టడీస్‌’ (సీసీఆర్‌ఏఎస్‌)కు పంపాం. వాళ్లు 500 మందికి ఇచ్చి వారిని పరిశీలన చేస్తారు. అనంతరం పూర్తిస్థాయి నివేదిక ఇస్తారు '- రాములు, ఆయుష్ కమిషనర్

వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది తమకు తెలియదని, దీనిపై కంటి వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకుంటామని రాములు అన్నారు. కంట్లో వేసే చుక్కలపై కొన్ని అనుమానాలు ఉన్నాయని, అవి తొలగిపోయిన తర్వాత దానిపైనా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘ కళ్లలో వేసే మందులో మూడు పదార్ధాలు వేస్తున్నారు. ఆయుర్వేదాన్ని బట్టి ఆ మూడింటి వల్ల నష్టం లేదు. నాణ్యత లాంటి అంశాలు పరిశీలించాల్సి ఉంది. గామస్థులను విచారించిన తర్వాత ఆ ప్రాంతంలో కరోనా కేసులు తక్కువ ఉన్నాయని తెలిసింది. కరోనా మరణాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. పూర్తి వివరాలను సీఎంకు వివరించాము. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక అందిస్తాం’’ అని రాములు చెప్పారు.

ఇదీ చదవండి:కాళీయమర్దిని అలంకారంలో యాదాద్రీశుడు

ABOUT THE AUTHOR

...view details