పోటీ పరీక్షల అభ్యర్థుల్లో చాలామంది చదవటానికి ఎక్కువ సమయం వెచ్చించి, రాతను సాధన చేసే అంశాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో ఇబ్బంది ఉండదు. ఉన్న నాలుగు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది. కానీ డిస్క్రిప్టివ్ పరీక్షల తీరు వేరు. అభ్యర్థి తన పరిజ్ఞానాన్ని సరైన రీతిలో రాత ద్వారా వ్యక్తీకరించటం ఇక్కడ చాలా ముఖ్యం. అలా చేసినప్పుడే అత్యధిక మార్కులు పొందే అవకాశాలుంటాయి. ఈ కి¨ంది మెలకువలు పాటించడం ద్వారా బలమైన భావవ్యక్తీకరణ, తద్వారా మంచి మార్కులు పొందవచ్చు.
పట్టు ఉన్న భాష ఎంపిక
ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ప్రధానంగా రెండు భాషలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఇంగ్లిష్; రెండోది తెలుగు. యూపీఎస్‌సీ మెయిన్స్ సహా రాష్ట్ర సర్వీస్ కమిషన్లు ఈ రెండు భాషల్లో జవాబులు రాయటానికి అంగీకరిస్తున్నాయి. చక్కని పదాలతో తమ భావాలను స్వేచ్ఛగా, సులభంగా వ్యక్తం చేయగలిగే భాషను ఎంపిక చేసుకోవటం మేలైన నిర్ణయం. రాష్ట్ర సర్వీస్ కమిషన్‌ల పరీక్షల్లో ఆంగ్ల భాష ద్వారా ఎక్కువ మార్కులు పొందవచ్చు అనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. ఇది అపోహ మాత్రమే. ఇలాంటి పొరపాటు అభిప్రాయాలతోనే మెయిన్స్‌లో చాలామంది..తమకు ఆంగ్లభాషపై తగినంత పట్టు లేకపోయినా తమ పరిజ్ఞానాన్నీ, భావాలనూ ఇంగ్లిష్‌లో రాసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చాలా సందర్భాల్లో బెడిసికొడుతోంది. దీనికి ఎన్నో సాక్ష్యాలూ ఉన్నాయి. గత రెండు దశాబ్దాల్లో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలూ, కళాశాలలూ ఎక్కువైన నేపథ్యంలో సాంకేతిక పదజాల భావవ్యక్తీకరణకు సంబంధించి ఇంగ్లిష్‌లో సఫలమవుతున్నారు. కానీ సాధారణ అంశాల భావవ్యక్తీకరణలో మాత్రం సరైన పట్టు కనిపించడం లేదు. ఫలితంగా రెండింటికీ చెడిన మాదిరిగా వీరు డిస్క్రిప్టివ్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. అందుకే ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఏ భాషలో భావవ్యక్తీకరణ చేయాలో నిర్ణయించుకోవటం చాలా కీలకం.
చిన్న చిన్న వాక్యాలు
కారణాలు ఏవైనప్పటికీ చాలామంది అభ్యర్థులు ఒక్కొక్క వాక్యాన్ని 5 లేదా 6 లైన్లలో రాసేస్తూ ఉంటారు. అనేక పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే- స్పష్టమైన భావవ్యక్తీకరణ చిన్నచిన్న పూర్తి వాక్యాల వల్లనే ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో సమయపు పరిమితి మూలంగా అభ్యర్థులు అయిదారు చిన్న వాక్యాల్ని కామాల ద్వారా అనుసంధానం చేస్తూ ఒకే పెద్ద వాక్యాన్ని రాస్తుంటారు. కానీ దీనివల్ల అస్పష్టత పెరిగి, మూల్యాంకనం చేసే వ్యక్తుల్లో సందిగ్ధత ఏర్పడుతుంది. ఫలితంగా తక్కువ మార్కులు వేసే ప్రమాదం ఉంది. చిన్న వాక్యాలు రాయడం వల్ల ఎక్కువ సమయం పట్టే ఇబ్బంది అయితే ఉంది. కానీ స్పష్టమైన భావ వ్యక్తీకరణ సాధ్యమై.. అంతిమంగా మంచి మార్కులతో రాణించవచ్చు.
భాషల మిశ్రమం
ఆంగ్ల మాధ్యమంలో రాసేవారు తెలుగు పదాలు రాయరు కానీ తెలుగు మాధ్యమంలో సమాధానాలు రాసేవారు చాలా సందర్భాల్లో ఆంగ్ల లిపిలో అనేక పదాలు రాస్తున్నారు. వ్యవహారంలో ఆంగ్లం, తెలుగు మిశ్రమం చెందటం దీనికి కారణం. రాత పరీక్షల్లో మాత్రం ఈ విధమైన మిశ్రమం సమంజసం కాదు. ఒకవేళ ఆంగ్ల పదాలు రాయాల్సి వస్తే తెలుగు లిపిలో రాయటం మేలైన నిర్ణయం. కొన్ని వాక్యాలు ఇంగ్లిషులో, కొన్ని తెలుగులో రాయడం సరికాదు. ఇది మార్కులు తగ్గించేందుకు కారణమవుతుంది. సాంకేతిక పదాలను పూర్తిగా తెలుగులో తర్జుమా చేస్తే పేపర్ దిద్దేవారికి అర్థం కాకపోయే ప్రమాదం ఉంది. అందుకే సాంకేతిక పదజాలాన్ని వీలైనంత వరకే తెలుగులో రాయటం మేలు. ఒక ప్రశ్నకు జవాబు పూర్తిగా తెలుగులో రాసి, మరో ప్రశ్న జవాబును ఇంగ్లిషులో రాసే అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇలాంటి అలవాటు పేపర్ దిద్దేవారిని చిరాకుపెట్టిస్తుంది.
పటాలూ.. పట్టికలూ
సందర్భాన్ని బట్టి పటాలు గీయటం ద్వారా భావవ్యక్తీకరణ బలంగా జరుగుతుంది. చరిత్ర పేపర్లో కూడా ఈ మెలకువలను అనుసరించవచ్చు. యుద్ధం జరిగిన ప్రదేశం కావచ్చు; రాజ్య భూభాగం కావచ్చు- పటాల రూపంలో ప్రదర్శించవచ్చు. రాజులను తులనాత్మకంగా పరిశీలించే సందర్భంలో పట్టికలు కూడా వేయవచ్చు. చరిత్రలోనే ఇంత అవకాశం ఉన్నప్పుడు మిగతా సబ్జెక్టుల్లో పుష్కలమైన అవకాశం కనిపిస్తుంది. అందువల్ల పోటీ పరీక్షకు సిద్ధమయ్యే సందర్భంలోనే ‘ఈ తరహా ప్రశ్నలకు ఇలా సమాధానం రాయవచ్చు’ అని ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటే పరీక్ష హాల్లో విజయవంతంగా దాన్ని అమలు చేయవచ్చు. ఫ్లో డయాగ్రమ్స్, వెన్ చిత్రాలు మొదలైనవాటిని ఎకానమీ, సైౖన్స్ అండ్ టెక్నాలజీ లాంటి సబ్జెక్టుల్లో ఉపయోగించవచ్చు. అయితే ప్రతి ప్రశ్నకూ ఇలా చిత్రాలు, పటాలు, పట్టికల జోలికి వెళ్లకుండా కొన్ని సందర్భాల్లోనే వినియోగించడం మంచిది.