Awards to Telangana: దేశంలో అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తున్న తెలంగాణ అనేక అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రతి ఏటా అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు గెలుచుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు మరోసారి అవార్డుల పంట పండింది. ప్రతి ఏటా ఇచ్చే అవార్డులతో భాగంగా ఈ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... ఈ మేరకు రాష్ట్రానికి లేఖను పంపింది. ఈసారి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరిలలో 19 అవార్డులు తెలంగాణ సాధించింది. నాలుగు కేటగిరీల్లో రాష్ట్రానికి 19 ఉత్తమ అవార్డులు వచ్చాయి.
రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, అభివృద్ధి విజన్ కారణంగానే ఈ అవార్డులు దక్కాయని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాల వల్లనే మన పల్లెలు ఆదర్శంగా మారాయన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ది పనులు చేపడుతూనే... నిరంతరం పారిశుద్ధ్య పనులు చేయడం వల్లే ఇలాంటి అభినందనలు వస్తున్నాయన్నారు. ఈ అవార్డులు రావడానికి కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, ప్రజలకు అభినందనలు తెలిపిన మంత్రి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.