రాష్ట్రంలో హరితహారం, వైకుంఠధామాలు, పారిశుధ్యం, వ్యర్థాల సేకరణ, నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్లు, మార్కెట్లు తదితరాల ఆధారంగా పట్టణప్రగతి పురస్కారాలు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 24న పట్టణప్రగతి ప్రారంభ దినోత్సవం సందర్భంగా నగర, పురపాలక సంస్థలు, నగరాభివృద్ధి సంస్థలు, నీటిసరఫరా సంస్థలు, ఎన్జీఓలు, సామాజిక అభివృద్ధి సంస్థలకు ఈ పురస్కారాలు అందజేయనున్నారు.
మోడల్ మున్సిపాలిటీ, పారిశుద్ధ్యం-ఘనవ్యర్థాల నిర్వహణ, పచ్చదనం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కేటగిరీల్లో ఈ అవార్డులు ఇస్తారు. పట్టణాల జనాభా ఆధారంగా అవార్డులు ఎంపిక చేస్తారు. అందుకోసం ఆయా పట్టణాల్లో ఉత్తమ విధానాలను నమోదు చేయాలని పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా కేటగిరీల్లోని అంశాలకు నిర్ణీత మార్కులను కేటాయించారు. ప్రజల భాగస్వామ్యం సహా మొత్తం 12 అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకోనున్నారు.