Avoid These Habits After Meal in Telugu :ఆరోగ్యమే మహాభాగ్యం.. మన ఆరోగ్యాన్ని మించిన సంపద అంటూ ఏదీ లేదు. మనం రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. మంచి ఆహారం తీసుకోవాలి. తీసుకున్న ఆహారంలోని పోషకాలు పూర్తిస్థాయిలో అందాలంటే.. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండాలి. అజీర్తి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత కొన్ని అలవాట్లను మానుకోవాలి.
Things Not to do After A Meal :కొందరకి భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అలవాటు. అలాంటి వారు వీలైనంత త్వరగా ఈ అలవాటును మానుకోవడం శ్రేయస్కరమంటున్నారు నిపుణులు. సాధారణంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి, పొట్టకు సరైన మొత్తంలో రక్తప్రసరణ అవసరం. అయితే తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఆ రక్తం చర్మం వైపు ప్రసరించి.. శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత సమయం పడుతుంది. దీని కారణంగా అజీర్తి వంటి సమస్యలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు. అందుకే ఆహారం తీసుకున్నాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే స్నానం చేయమంటున్నారు.
కాఫీ/టీలు తాగుతున్నారా.. మనలో చాలామంది కాఫీ/టీ ప్రియులుంటారు. ప్రతి సందర్బంలోనూ సేవిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కాఫీ, టీలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అయితే దీనివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలును గ్రహించే శక్తి శరీరానికి క్రమంగా తగ్గుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు ముఖ్య కారణం వీటిలోని ఫినోలిక్ సమ్మేళనాలేనట. కాబట్టి భోజనం తీసుకున్న ఒక గంట విరామం తర్వాత.. తక్కువ మోతాదులో తాగితే ఎలాంటి సమస్యా ఉండదు.