రాష్ట్రంలో మ్యుటేషన్ చేయించుకోవడం పెద్ద సవాల్‌గా ఉండేది. ఆస్తులు క్రయ విక్రయాలు జరిగినా కొనుగోలుదారులు తమ పేర్లతో ఆస్తులు మార్చుకోవాలంటే.. పురపాలక, పంచాయతీ శాఖల కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి ఉండేది. మ్యుటేషన్ కోసం అన్ని రకాల డాక్యుమెంట్లతో.. తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఇలా అన్ని పత్రాలు అందజేసినా మ్యుటేషన్ అయ్యేది కాదు. కాళ్లు అరిగేలా ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగి.. అడిగిన ప్రతి కాగితం అందజేయాల్సి వచ్చేది. అయిదారు నెలలే కాదు.. ఏడాది కాలం కూడా తిరగాల్సి ఉండేది.
సునాయసంగా మ్యుటేషన్ అయ్యేట్లు..
ఈ పరిస్థితులను పూర్తిగా రూపుమాపి.. సునాయాసంగా మ్యుటేషన్ అయ్యేట్లు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశలో సుదీర్ఘంగా కసరత్తు చేసింది. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ సాఫ్ట్‌వేర్‌తో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌ను అనుసంధానం చేసింది. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే.. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులే సర్టిఫికెట్‌ను జారీ చేసేట్లు.. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట ఈ రెండు సర్వర్ల అనుసంధానం కాకపోవడం.. అడుగడుగున సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతూ రావడంతో.. వాటిని అధిగమించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఇబ్బంది పడేది. ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ విజయవంతం అయ్యింది. 2 నెలలుగా ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా విజయవంతంగా మ్యుటేషన్ కొనసాగుతోంది.
5 నిమిషాల్లోనే పూర్తి...
సెప్టెంబరు నెల రెండో వారంలో అందుబాటులోకి వచ్చిన ఈ అటోమెటిక్ మ్యుటేషన్ ప్రక్రియ.. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆ తర్వాత ఒక్కొక్కటే సమసి పోయాయి. సాంకేతిక సమస్యలు పూర్తిగా తొలగిపోవడంతో.. మ్యుటేషన్ కార్యక్రమం సజావుగా సాగుతున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు లక్షా 12, 978 డాక్యుమెంట్లు అటోమేటిక్‌గా మ్యుటేషన్ అయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 28,548, రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో 48,018 మ్యుటేషన్‌లు పూర్తయ్యాయి. ఇక పంచాయతీరాజ్ పరిధిలో 32,491 డాక్యుమెంట్లు, వరంగల్ మున్సిపల్ పరిధిలో 3,921 డాక్యుమెంట్లు మ్యుటేషన్ పూర్తయ్యినట్లు రిజిస్ట్రేన్లు-స్టాంపుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పక్రియతో మ్యుటేషన్‌లు.. వేగవంతం అయ్యినట్లు రిజిస్ట్రేషన్ శాఖ పేర్కొంటోంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయ్యిన డాక్యుమెంట్లకు సంబంధించి.. కేవలం 5 నిమిషాల్లోనే మ్యుటేషన్ పూర్తి చేసి పత్రాలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.