Auto Drivers Protest: నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కొంతమంది తమ ఆటోలను నగరంలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామాల్లో పని లేకపోవడంతో కొన్నేళ్లుగా నగరంలోనే ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఆటోలను నగరంలో తిరగకూడదని ఆదేశాలు జారీ చేస్తే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వాపోతున్నారు. తమ పర్మినెంట్ చిరునామా గ్రామాల్లో ఉండటంతో అక్కడి అడ్రస్ మీదనే ఆటోలు కొనుగోలు చేసి, ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని వారు వెల్లడించారు.
తమ ఆటోలకు నగరంలో అనుమతి లేనప్పుడు అధికారులు మీటర్ రీడింగ్ సీజింగ్తో పాటు సీరియల్ నెంబర్ ఇచ్చి స్టిక్కర్లు ఎందుకు అతికించారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల వాహనాలు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు నగరానికి ఆనుకోని ఉన్న జిల్లాల నుంచి వచ్చే ఆటోలను అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇతర జిల్లాల ఆటోలకు అనుమతి ఉండదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా కరోనాతో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని తమ ఆటోలను నగరంలో తిరగనివ్వాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
బతుకుదెరువు ఎలా..