హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలు, జిల్లా కేంద్రాల్లో పగలూ రాత్రీ ఆటోలు నడుపుతూ ఉపాధి పొందే కార్మికులు దాదాపు ఆరు లక్షల మంది ఉన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 2.10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ప్రభుత్వం నుంచి బియ్యం, నగదు అందినప్పటికీ కుటుంబ ఖర్చులు తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరికి రోజూ అర లీటరు పాలు కావాలి. మా అమ్మకు నెలకు రూ.500 మందులు కొనాలి. ఇక ఇంట్లో సరకులకు కనీసం నెలకు రూ.3 వేలు అవుతుంది. అడ్డాకు పోలేని ఈ పరిస్థితిలో ఎలా బతకాలి.’ అంటూ తన అవస్థను వివరించారు హిమాయత్‌నగర్‌కు చెందిన అబ్దుల్.
బ్యాంకు కిస్తీలపై అయోమయం
ఫైనాన్స్‌పై ఆటోరిక్షాలు కొన్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల అద్దెలు, ఫైనాన్స్ కిస్తీల చెల్లింపునకు సర్కారు వెసులుబాటు కల్పించినా, తరువాతైనా చెల్లించేదెలాగని వాపోతున్నారు. రోజుకు డీజిల్ ఖర్చు పోను కనీసం రూ. అయిదు వందల గిరాకీ ఉంటేనే ఆ రోజు గడిచినట్లు అని చెప్పారు నర్సింహారావు అనే డ్రైవర్. మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఒక్కోచోట కనీసం అయిదువేలకు పైగానే ఆటోలు నడుస్తున్నాయి. వీటిలో సగం వరకు ఫైనాన్స్‌పై తీసుకున్నవేనని అంచనా.
ఇంకెన్నాళ్లిలా?:
'సారూ... నన్ను ఆపకుండ్రీ! చాలా రోజుల తరువాత రోడ్డెక్కిన. ఇంటికాడ ఇద్దరు పిల్లలున్నరు. పాలకు గుక్కబట్టి ఏడుస్తున్నరు. నెల రోజుల బట్టి చేతికి పైసా రాకపాయె. సొంతూరు నాగార్జునసాగర్‌లో ఉపాధి లేక నగరమొచ్చి ఆటో తిప్పుతున్న. పెద్దలంటే ఎట్లోగట్ల బయటపడతం. పిల్లల సంగతేంది సారు. ఇంకెన్నాళ్లుంటది గీ పరిస్థితి. ఆటోడ్రైవర్లమైతే సయించలేకున్నం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రశేఖర్ అనే ఆటో డ్రైవర్. తెలిసిన ఒక కిరాయి దొరకడం వల్ల మంగళవారం రోడ్డుమీదకు వచ్చినట్లు తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో రాష్ట్రంలో ఆటో రిక్షాలు నడుపుతున్న కార్మికుల దీనావస్థకు ఇదొక ఉదాహరణ.